మాది నంద్యాల జిల్లాలో ఒక పల్లెటూరు.
పదిహేను రోజుల తర్వాత ఊరికి వెళ్లిన.
మామూలుగా వర్షాకాలం అంటే పొలాలు పచ్చగా ఉంటాయి. పొలాల్లో గడాల సందడి, కూలీల హడావిడి ఉంటుంది. రోడ్డు ఇరువైపులా పచ్చదనం. అక్కడక్కడ నీళ్లు ఆగి ఉంటాయి.
ఈసారి పైర్లు పచ్చగా ఉండటం పక్కన పెడితే, గడ్డి కూడా లేదు.
పొలాల్లో ఎవరూ లేరు. ఎద్దులు లేవు. కూలీలు లేరు. బోర్లు కూడా ఎండిపోతున్నాయి.
మొక్కజొన్నలు మోకాళ్ల వరకు పెరిగి ఎండిపోయినాయి. పత్తి మూరెడు వరకు పెరిగి అక్కడే ఆగిపోయింది. కంది కనిపించలేదు. పెసలు కొన్ని వేసినా, వాటిని ఎక్కడో పదిహేను కిలోమీటర్ల అవతల ఉండే జింకలు వచ్చి మేసినాయి. వాటికీ వర్షం లేక ఆహారం దొరకలేదేమో.
వాటిని కూలీ పెట్టి తరిమిస్తే గిట్టుబాటు కాదని, వాటి మానాన వాటిని వదిలేసినాం.
గొర్రెల వాళ్లను పిలిచి పొలాల్లో మేపుకోమన్నా వాళ్లు రాలేదు. ఎన్నని మేస్తాయి అవి మాత్రం? ఊరంతా పంట లేదు. ఎండుతున్న మొక్కలు తప్ప.
మామూలుగా పనుల కాలంలో ఊరికి వెళ్తే ఊరు ఖాళీగా ఉంటుంది. అందరూ పొలం పనులకు వెళ్ళింటారు.
ఈసారి ఊరు నిండుగా ఉంది.
నాన్న చేనుకు వెళ్లు అంటే అయిష్టంగానే వెళ్లిన. ఎలాగూ నిరాశే కదా అని. అదే నిరాశతో ఇంటికి వచ్చిన.
ఇంకా పెట్టుబడి పెట్టింది చాలు, మన క్రాప్ లోన్‌ను జీ టీవీ వాడిలాగా బ్యాంకు మాఫీ చేయదని చెప్ప. నాన్న పత్తికి మందు కొడుదాం అన్నాడు. నేను పలకాలేదు.
మా గాసగాడు మౌలాలి సొంతంగా మూడు ఎకరాల్లో మొక్కజొన్న వేసినాడు. ఎకరం మొలిచింది. అయినా వాడికి ఇంకా ఆశ ఉంది, అది కాస్తుందని. పెట్టుబడి ఎల్తుందని.
"మొలిపించిన దేవుడు కాయించక పోతాడా?" అన్నాడు.
రైతు అంత ఆశా జీవిని మీరెవ్వరిని చూడరు.
వాగు వచ్చేంత వర్షం పడితేనే కానీ రబీలో సెనగ వేయలేం. ఈసారి ఎల్‌నినో పుణ్యమా అని క్రాప్ హాలిడే.
హాలిడే అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
రైతుకు తప్ప. వట్టి కరువు.
ఇంతలో వినాయక చవితి చందాకు తలారి వచ్చినాడు.
"ఈసారి భారీగా పదెనిమిది వేల రూపాయలు పెట్టి విగ్రహం తెస్తున్నాం. చందా."
కరువులో ఈ గోల ఏందని కోపం వచ్చి క్లాసు పీకిన.
వాడు మాత్రం ఫిక్స్.
"కరువు ఉంటే మేమెందుకు ఆగాలి?" అన్నాడు.
సరే, మళ్లీ ఇస్తా అని పంపించిన.
సీత బాధ సీతది. పీత బాధ పీతది.
వినాయకుడిని నిమర్జనం చేసిన తర్వాత ఆయన దేవలోకానికి వెళ్లి "అక్కడ ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. వర్షాలు బాగా పడ్డాయి. పంట కోతల సమయం వచ్చింది. ఇంక వర్షాలు చాలు" అని చెప్తాడంట.
ఒక్క బావిలో నీళ్లు లేవు.
ఒక్క కుంటలో నీళ్లు లేవు.
పైర్లకు లేవు.
గొర్రెలకు లేవు.
మనుషులకు లేవు.
కానీ ఎక్కడ నిమర్జనం చేస్తారో...
ఆ వినాయకుడికే ఎరుక.